Home > తెలంగాణ > గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపానపోలేదు - సీఎం కేసీఆర్

గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపానపోలేదు - సీఎం కేసీఆర్

గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపానపోలేదు - సీఎం కేసీఆర్
X

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న రైతుబంధు, ద‌ళిత‌బంధు ప‌థ‌కాల సృష్టిక‌ర్త‌ను తానేనని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రెండు ప‌థ‌కాల అమ‌లుతో అటు రైతులు, ఇటు ద‌ళితులు ఎంతో అభివృద్ధి చెందుతున్నార‌ని చెప్పారు. అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. రైతు బంధు అనే పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రైతులను ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు.

గతంలో రైతులు అప్పులు చెల్లించలేక నానా ఇబ్బందులు పడ్డారని కేసీఆర్ అన్నారు. బ్యాంకు సిబ్బంది వచ్చి తలుపులు తీసుకెళ్లే వారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. గ్రామాల్లో ధాన్యపు రాశులు రావాలన్న సంకల్పంతో రైతు బంధు తెచ్చానని అన్నారు. ప్ర‌స్తుతం ఈ పథకం కింద రూ. 10 వేలు ఇస్తున్నామని దాన్ని విడతలవారీగా రూ. 16 వేల‌కు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

ఓట్ల కోసం హామీలు ఇవ్వ‌డం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం అన్న‌పూర్ణ అయిందని, రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోందని అన్నారు. అలాంటప్పుడు ప్రజలు దొడ్డు బియ్యం ఎందుకు తినాలన్న ఉద్దేశంతో రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేకొద్దీ సంక్షేమ పథకాలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు.

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే అచ్చంపేటలోని 2 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత తనదని కేసీఆర్ స్పష్టం చేశారు. మళ్లీ పాలనా పగ్గాలు చేపట్టిన నెలలోపే పాలిటెక్నిక్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్న బాలరాజును గెలిపించాలని కోరారు.

Updated : 26 Oct 2023 11:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top