వివాదాలు వెంటాడినా టికెట్లు దక్కాయి...
X
వచ్చే ఎన్నికల్లో పోటీచేసే 115 మంది అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగులకే ఎక్కువ అవకాశం దక్కింది. కేవలం ఏడుగురికి మాత్రం వివిధ కారణాలతో టికెట్లను నిరాకరించారు. వీరిలో కొందరు వివాదాలు, అవినీతి ఆరోపణలతో పోటీ నుంచి దూరమయ్యారు. మరికొందరు మాత్రం వివాదాలు వెంటాడిన, తీవ్ర ఆరోపణలు వచ్చినా వారి టికెట్లను పదిలం చేసుకున్నారు.
దుర్గం చిన్నయ్యకే బెల్లంపల్లి టికెట్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్యను ఇటీవల వివాదాలు, లైంగిక ఆరోపణలు వెంటాడాయి. శేజల్ అనే మహిళ చిన్నయ్యపై తీవ్ర ఆరోపణలు చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనలు చేపట్టింది. ఈ క్రమంలోనే రెండు,మూడు సార్లు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. ఢిల్లీకి చేరి చిన్నయ్యపై వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ అధినేతకు సైతం విజ్ఞప్తి చేసింది. దీంతో ఈ సారి బెల్లంపల్లి చిన్నయ్యను తప్పిస్తారని అంతా అనుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం అతడికే మళ్లీ టికెట్ కేటాయించడం విశేషం.
వనమాకే టికెట్..
భద్రాద్రి కొత్తగూడెం టికెట్ వనమా వెంకటేశ్వరరావుకే మళ్లీ ఎమ్మెల్యే టికట్ దక్కింది. వివాదాలు, కేసుల ఆయను చుట్టుముట్టినా కేసీఆర్ మాత్రం వనమాపై మరోసారి విశ్వాసముంచారు. పాల్వంచలో రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసు అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేందర్ కారణమని ఆరోపణలు రావడం సంచలనమైంది. ఈ అంశంలో వనమాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు సైతం ఎమ్మెల్యే రాజీనామాకు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. అదే విధంగా తప్పుడు అఫడివిట్ సమర్పించతో హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఇవేవీ ఆయనను ఎన్నికల పోటీ నుంచి దూరం చేయలేకపోయాయి. మరోసారి అవకాశం దక్కించుకున్నారు.
ఎమ్మెల్యే రాజయ్య ఔట్..
తన చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై సీఎం కేసీఆర్ కనికరం చూపలేదు. అతడిని తప్పించి కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు. రాజయ్య తరచూ వివాదాల్లో ఉండడం, లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం, ఒక వైపు మహిళ సర్పంచ్ తీవ్ర ఆరోపణలు చేయడం వంటి అంశాలు టికెట్ రాకూండా చేశాయి. కడియా శ్రీహరితో ఉన్న విబేధాలు కూడా రాజయ్యను దెబ్బకొట్టాయి.
జనగామ ఎమ్మెల్యే టికెట్ ను ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి ఇంకా కేటాయించలేదు. ప్రస్తుతం దీనిని పెండింగ్లో పెట్టారు. ముత్తిరెడ్డిపై ఆయన కూతురు చేస్తున్న ఆరోపణలే ఇందుకు కారణమని తెలుస్తోంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు టిక్కెట్ నిరాకరించారు. ఆయన భారతీయ పౌరసత్వంపై కేసు నడుస్తుండడంతో టికెట్ ఇవ్వడం లేదని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. చల్మెడ ఆనందరావుకు అక్కడ టిక్కెట్ ఖరారు చేశారు.