Home > తెలంగాణ > సెప్టెంబర్ 15న 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

సెప్టెంబర్ 15న 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

సెప్టెంబర్ 15న 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
X

రాష్ట్రంలో వైద్యారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం అందులో భాగంగా ఏటా కొత్త ప్రభుత్వ కాలేజీలు ప్రారంభిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు వైద్యారోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆ పనులపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

సెప్టెంబర్ 15న కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలు ప్రారంభంకానున్నాయి. వాటిలో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతో పాటు తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యను మరింత చేరువ చేసేందుకే సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. గతేడాది ఒకే వేదిక నుంచి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 8మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించినట్లుగా, ఈ ఈనెల 15న మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని అన్నారు.

9కాలేజీల ప్రిన్సిపాల్స్ అడ్మిషన్ల ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని హరీష్ రావు చెప్పారు. శుక్రవారం మరోసారి భేటీయై ఏర్పాట్లను పర్యవేక్షించాలని కాళోజీ వర్సిటీ వీసీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ను మంత్రి ఆదేశించారు. అన్ని మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్‌లు సమావేశం ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే, అందులో మూడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే ఉన్నాయని చెప్పారు. తాజాగా ప్రారంభించే 9 మెడికల్ కాలేజీలతో కలుపుకొని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరుతుందని కొత్తగా 900 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. 2014లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 3915కు చేరడంపై హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు.

Updated : 7 Sept 2023 4:47 PM IST
Tags:    
Next Story
Share it
Top