BRS Election Campaign: దూకుడు పెంచిన గులాబీ బాస్.. ఇవాళ 2 నియోజకవర్గాల్లో పర్యటన
X
సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత హుస్నాబాద్ వెళ్లి.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక ఇవాళ(సోమవారం) జనగామ, భువనగిరిలో పార్టీ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో ప్రసంగించబోతున్నారు. ఈ రెండు సభల కోసం గులాబీ శ్రేణులు.. ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు. ఒక్కో సభకు దాదాపు లక్ష మందికిపైగా జనసమీకరణ చేసే ప్రయత్నాల్లో నేతలు నిమగ్నమయ్యారు. సీఎం సభల కోసం పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
జనగామలో బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని, భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డిని గెలిపించాలని కేసీఆర్ ప్రజలను కోరబోతున్నారు. జనగామలోని మెడికల్ కాలేజీ మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభ కోసం సీఎం.. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి జనగామ సభకు వెళ్లనున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా ఆదేశాల మేరకు వెస్ట్‌జోన్ డీసీపీ సీతారాం, డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.తాత్కాలిక హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు.
జనగామ సభ ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్ భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. ఇందుకోసం బీఆర్‌ఎస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. వేదికను, సభా ప్రాంగణంతోపాటు హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా రెయిన్ ప్రూఫ్ స్టేజీ వేశారు. బహిరంగ సభ నేపథ్యంలో భువనగిరి పట్టణం గులాబీమయంగా మారింది. జనం ఇబ్బందులు పడకుండా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు లక్ష మందికి పైగా జనం రానున్నట్టు బీఆర్‌ఎస్ శ్రేణులు తెలిపాయి. రెండో చోట్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.