CM KCR Election Campaign: నేడు జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం
X
ఎన్నికల ప్రచారంలో భాగంగా BRS అధినేత, సీఎం కేసీఆర్ నేడు జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మొదట జుక్కల్ చౌరస్తాలోని సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు సీఎం. జుక్కల్ చౌరస్తాలో జాతీయ రహదారికి ఆనుకున్న ఉన్న ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేస్తున్న ప్రజా ఆశీర్వాద సభలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత 2.20కి బాన్సువాడ పట్టణంలోని వీక్లి మార్కెట్ మైదానంలో నిర్వహించే సభకు హాజరుకానున్నారు. ఆ తర్వాత 3.20 కి హెలికాప్టర్ ద్వారా నారాయణ్‌ఖేడ్‌కు వెళ్లి అక్కడి సభలో సీఎం పాల్గొంటారు. వరుసగా ఒకే రోజు మూడు బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొననుండగా.. ఇందులో రెండు సభలు కామారెడ్డి జిల్లాకు సంబంధించినవే ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సీఎం రాక సందర్భంగా పటిష్ట ఏర్పాట్లను చేశారు.
జుక్కల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సభా ప్రాంగణంలోనే ప్రత్యేకంగా హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలను సైతం తరలించేందుకు వాహనాలు సమకూర్చుతున్నారు. సభను విజయవంతం చేసేందుకు ఎంపీ బీబీపాటిల్‌తో పాటు జడ్పీ మాజీ ఛైర్మన్ దఫేదార్ రాజు తమ తోడ్పాటును అందిస్తున్నారు. ఇక బాన్సువాడలో నిర్వహించనున్న సీఎం సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా తరలించేందుకు సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. వేదికతో పాటు సభా ఏర్పాట్లలో డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి నిమగ్నమయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ భారాస అభ్యర్థులకు మద్దతుగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల్లో మళ్లీ తాము అధికారంలోకి వస్తే జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో చేపట్టే అభివృద్ధి పనులపై స్పష్టమైన హామీలు ఇచ్చే అవకాశముంది. ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గంలో బిచ్కుందను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడంతో పాటు పిట్లం, బిచ్కుంద పట్టణాలను పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రస్తావించే అవకాశమున్నట్లు, నియోజకవర్గంలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుతో పాటు మంజీరపై మరో ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రతిపాదనను ప్రజల ముందుంచనున్నట్లు తెలుస్తోంది. బాన్సువాడ డివిజన్ కేంద్రాన్ని జిల్లాకేంద్రంగా ప్రకటించాలనే ప్రతిపాదనపై సీఎం స్పందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బాన్సువాడ నియోజకవర్గాన్ని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. నూతన భవనాల నిర్మాణంతో పాటు ఇతరత్రా అభివృద్ధి పనుల వల్ల బాన్సువాడ రూపురేఖలు మారిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించిన నియోజకవర్గంగా బాన్సువాడ ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే.