30 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్ని కేసీఆర్ ఫైనల్ చేస్తడు - బండి సంజయ్
X
కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఎంపిక చేస్తారని అన్నారు. వారికి అవసరమైన ఆర్థికసాయం కూడా చేస్తారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో నిర్వహించిన బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టిఫిన్ బైటక్ ప్రోగాంలో బండి ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని బండి సంజయ్ ఖండించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిసే సీఎం కేసీఆర్ కాంగ్రెస్ను లేపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హస్తం పార్టీని ఎంతలేపినా లేచే స్థితిలో అది లేదని సటైర్ వేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని సీనియర్ నేత జానారెడ్డి చెప్పిన విషయాన్ని బండి గుర్తు చేశారు. కర్నాటక ఎన్నిక ప్రచారానికి సైతం కేసీఆర్ కాంగ్రెస్కు ఆర్థిక సాయం చేశారని ఆరోపించారు.
ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌కు వస్తే కేసీఆర్‌కు వణుకుపుడుతుందని బండి అన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలను, మోడీ నాయకత్వాన్ని నమ్మి పార్టీలోకి వచ్చేవారిని స్వాగతిస్తామని చెప్పారు. బీజేపీ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారంటూ వస్తున్న వార్తలపైనా ఆయన స్పందించారు. తమ పార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్లరని చెప్పారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.