అమరవీరుల స్మారకం ప్రారంభానికి సర్వం సిద్ధం.. 22న ఆవిష్కరించనున్న సీఎం
X
తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 22న సీఎం కేసీఆర్ అమరవీరుల స్మారకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. అధికారులతో కలిసి ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి.. అక్కడి నుంచే అమరజ్యోతికి సెల్యూట్ చేస్తారని, ప్రభుత్వం తరఫున సీఎం సమక్షంలో పోలీస్ గన్ సెల్యూట్ ఉంటుందని అన్నారు.
స్మారకం ప్రారంభోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహం చౌరస్తా నుంచి అమరుల స్మారకం వరకు 5వేల మంది కళాకారులతో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. దాదాపు 800 డ్రోన్లతో సాయంత్రం అమరుల త్యాగాలు, తెలంగాణ ప్రగతి చాటి చెప్పే ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ దాదాపు 10వేల మందితో దీపాలు వెలిగించే ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున సచివాలయం ఎదురుగా వినూత్న రీతిలో పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్‌తో అమరవీరుల స్మారకం నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం కోసం ఎన్నేండ్లయినా పాడవని స్టీల్‌ను ఉపయోగించారు. ఇందుకోసం 1200 టన్నుల మెటీరియల్ వాడారు. ఎక్కడా అతుకులు కనిపించకుండా అరుదైన కట్టడాల్లో ఒక్కటిలా ఉండేలా దీన్ని నిర్మించారు. అమరుల స్ఫూర్తి నిత్యం జ్వలించేలా దీపం ఆకృతిలో స్మారకం దర్శనమివ్వనుంది. స్మారకంలో కన్వెన్షన్ రూమ్, రూఫ్ టాప్ రెస్టారెంట్, ఆడియో విజువల్ రూమ్ తదితర ఏర్పాట్లు చేశారు. మొదటి అంతస్తులో మ్యూజియం నిర్మించారు. ఇందులో తెలంగాణ చరిత్రకు సంబంధించిన విశేషాలను ప్రదర్శించనున్నారు.