పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. సీఎం కేసీఆర్ పొలిటికల్ ప్లాన్!!
X
Thumb: 'బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు పడాలనే.. ఈ హడావుడి'
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గం ద్వారా నాగర్ కర్నూలు వెళ్లనున్న సీఎం.. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు నార్లాపూర్ రిజర్వాయర్ సమీపంలోని కంట్రోల్ రూమ్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం ఒక మోటారును స్విచ్ఆన్ చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.
అయితే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ వేళ ప్రతిపక్షాలు.. ఇదంతా సీఎం కేసీఆర్ ఎన్నికల స్ట్రాటజీ అని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో సిద్ధం కాకున్నా.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారని అంటున్నారు. నిజానికి దాదాపు ఎనిమిదిన్నర సంవత్సరాల(2015లో ) క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సర్వేలు చేపట్టి పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని ప్రారంభించింది. కానీ పలు కారణాలతో ఆ పథకం నత్త నడకన సాగుతోంది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో రిజర్వాయర్లు సిద్ధం కాలేదు.
ఎన్నికల నేపథ్యంలో పాలమూరు-రంగారెడ్డి పథకం ఆయా నియోజకవర్గాల్లోని తమ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపకూడదన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఇలా హఠాత్తుగా ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమయ్యారని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు పడాలనే.. ఈ హడావుడి చేస్తున్నారని అంటున్నారు. ఈ ప్రాజెక్టు కన్నా ఆలస్యంగా చేపట్టిన కాళేశ్వరం పూర్తికాగా పాలమూరు-రంగారెడ్డి పథకం ఇంకా పూర్తి కాలేదని.. ప్రజలను ఏదో నమ్మించాలని, భరోసా ఇవ్వాలి అన్నట్లుగా కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నారని అంటున్నారు. మరోవైపు ఆయా ప్రాంతాల్లోని ప్రజలు.. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక బీడు భూములు పచ్చబడతాయని, తమ జీవితాలు బాగుపడతాయని భావిస్తున్నారు.