రేషన్ కార్డు లేకుంటే 6 గ్యారెంటీలు రావు.. సీఎం రేవంత్ క్లారిటీ!
X
రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజా పాలన పేరుతో 6 గ్యారెంటీలకు అర్హులను ఎంపిక చేసేందుకు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. కాగా 6 గ్యారెంటీల్లోని ప్రతి స్కీమ్ కు రేషన్ కార్డు తప్పనిసరి అని ప్రచారం జరుగుతోంది. రేషన్ కార్డు లేకుంటే ఏ పథకం రాదు అని జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సెక్రటేరియట్ లో నిర్వహించిన 6 గ్యారెంటీలకు సంబంధించిన లోగో, పోస్టర్, ఫామ్ రిలిజ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ రేషన్ కార్డు కండిషన్ పై క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు లేకుండా ఏ పథకం రాదు అని స్పష్టం చేశారు. అయితే రేషన్ కార్డు లేని వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చి వారందరికీ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రేపటి నుంచి రేషన్ కార్డు ఉండి 6 గ్యారెంటీలకు అర్హులను గుర్తించి అమలు చేస్తామని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా అట్టడుగున ఉన్న పేదలకు మొదట న్యాయం జరగాలి అనే సూత్రంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.