Home > తెలంగాణ > Revanth Reddy : జార్ఖండ్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ..!

Revanth Reddy : జార్ఖండ్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ..!

Revanth Reddy : జార్ఖండ్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ..!
X

జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్కు చేరింది. కొత్త సర్కారు ఏర్పడిన వెంటనే రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అధికార జేఎంఎం - కాంగ్రెస్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలంతా హైదరాబాద్కు వచ్చారు. ప్రస్తుతం వారు శామీర్ పేటలోని లియోనియా రిసార్టులో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వారిని కలవనున్నట్లు సమాచారం. ఝార్ఖండ్‌ ఎమ్మెల్యేలతో సీఎం భోజనం చేసే అవకాశం ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి ఇప్పటికే రిసార్టుకు చేరుకున్నారు. పోలీసులు రిసార్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

జార్ఖండ్లో కొలువుదీరిన చంపై సోరెన్ ప్రభుత్వం 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆదేశించారు. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేలకు ఇతర పార్టీలు గాలం వేయకుండా జేఎంఎం - కాంగ్రెస్ పార్టీలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తమ కూటమి ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్కు తరలించారు. సభలో బల నిరూపణ జరిగే రోజు వరకు వారంతా హైదరాబాద్లోనే ఉండనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఈ ఎమ్మెల్యేల కో ఆర్డినేషన్ బాధ్యతను పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్కు అప్పగించింది.

జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుతం జేఎంఎంకు 29 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్ కు 17, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఐఎంల్ కు చెరొక ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. ఇక బీజేపీ బలం 26 కాగా, ఏజేఎస్యూకు 3, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. జేఎంఎం, కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఐఎంల్ కూటమికి 49 మంది సభ్యులు ఉండగా.. ప్రతిపక్ష పార్టీలకు 31 మంది సభ్యుల బలం ఉంది. అయితే డిసెంబర్ 31న మనీలాండరింగ్ స్కాంలో హేమంత్ సోరెన్ అరెస్ట్ కావడంతో జార్ఖండ్లో రాజకీయం హీటెక్కింది. నాటకీయ పరిణామాల మధ్య చంపై సోరెన్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Updated : 3 Feb 2024 9:29 PM IST
Tags:    
Next Story
Share it
Top