బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నా ప్రసంగం వినాల్సిందే.. వారికిదే శిక్ష: సీఎం రేవంత్
X
అసెంబ్లీ సమావేశాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయబోమని.. వారికిదే కాంగ్రెస్ పార్టి విధించే శిక్ష అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గట్టిగా కేకలు వేశారు. ఈ విషయంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారిస్తుండగా.. రేవంత్ రెడ్డి స్పందించారు. ‘సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేదే లేదని.. ఇక్కడే ఉండి తన ప్రసంగం వినాల్సిందేనని చెప్పారు. ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ వేసే శిక్ష అని రేవంత్ చెప్పుకొచ్చారు. క్వశ్చన్ పేపర్లు లీక్ చేసి 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. పేపర్ లీక్ జరిగినప్పుడు టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేసి దోషులకు శిక్షలు వేసి.. మళ్లీ పరీక్షలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్నవాళ్లంతా.. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపినందుకు.. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్నే రద్దు చేసిందని రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఒక్కసారి కూడా అమరవీరుల కుటుంబ సభ్యులను ప్రగతిభవన్‌లోకి పిలిపించుకున్నారా? ఉద్యమ సమయంలో బిడ్డలను కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకున్నారా? అని ప్రశ్నించారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక కూడా కృష్ణా జలాలను ఎందుకు వినియోగించుకోలేకపోయాం? ప్రత్యేక రాష్ట్రంలో కూడా పాలమూరు, చేవెళ్ల ప్రాంతంపై వివక్ష కొనసాగిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రాణహిత - చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేసి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని సీఎం ఆరోపించారు. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని.. వాళ్లిప్పటికీ ఆందోళన చేస్తూనే ఉన్నారని తెలిపారు.
ఏడేళ్ల క్రితం ఇసుక దోపిడీని ప్రశ్నించిన నేరెళ్ల ప్రజలను కేసులు పెట్టి వారిని బీఆర్ఎస్ పార్టీ హింసించిందని అన్నారు. దళితులను లాకప్‌లలో పెట్టి.. కరెంట్ షాక్ ఇచ్చి హింసించారని మండిపడ్డారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మోల్యేలను ఎవ్వరినీ ఎట్టిపరిస్థితుల్లో సభ నుంచి బయటకు పంపించేది లేదని తేల్చిచెప్పారు. వారిని సభలోనే కూర్చోబెట్టి కఠోర నిజాలు వినిపిస్తాం. వారికి ఇదే శిక్ష అని సీఎం రేవంత్ అన్నారు.