Home > తెలంగాణ > రాయదుర్గం-శంషాబాద్‌ మెట్రో ప్రాజెక్టు నిలిపివేయాలని సీఎం ఆదేశం

రాయదుర్గం-శంషాబాద్‌ మెట్రో ప్రాజెక్టు నిలిపివేయాలని సీఎం ఆదేశం

రాయదుర్గం-శంషాబాద్‌ మెట్రో ప్రాజెక్టు నిలిపివేయాలని సీఎం ఆదేశం
X

రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో టెండర్లను తక్షణం నిలిపివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దానికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఎయిర్‌పోర్టు మీదుగా ఎలైన్‌మెంట్‌ రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు, దాని విస్తరణ ప్రణాళికలు, ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాయదుర్గం- శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు రెండో దశలో ప్రతిపాదించిన మెట్రో మార్గం ప్రతిపాదన, టెండర్‌ను పక్కన పెట్టాలని ఆదేశించారు.

ఈ మార్గానికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీస్-ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఎయిర్‌పోర్టు మీదుగా ఎలైన్‌మెంట్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రెండు మార్గాలను పరిశీలించాలని సూచించారు. చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, విమానాశ్రయం పీ7 రోడ్డు ఒక మార్గం కాగా.. చాంద్రాయణగుట్ట, బార్కాస్‌, పహాడీషరీఫ్‌, శ్రీశైలం రోడ్డు మార్గాన్నీ అధ్యయనం చేయాలని సూచించారు. ఈ రెండు మర్గాల్లో ఏదీ తక్కువ ఖర్చు అయితే దానికి ప్రాధాన్యం ఇచ్చి కొత్త ఎలైన్‌మెంట్‌ రూపొందించాలన్నారు

రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రో లైను నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేసి.. టెండర్లను కూడా పిలిచింది. వాటిని ఆమోదించే దశలో ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో వాటి ఖరారుపై అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఈ లైనుకు దాదాపు రూ.6,250 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా.. ఈ లైన్‌ విషయంలో సర్కారు వైఖరిలో మార్పు వచ్చింది. శంషాబాద్‌ నుంచి విమానాశ్రయానికి ఓఆర్‌ఆర్‌ ఉండటంతో ఈ కారిడార్‌లో మెట్రో లైను అవసరం లేదని సీఎం రేవంత్‌ భావిస్తున్నారు.

Updated : 14 Dec 2023 8:15 AM IST
Tags:    
Next Story
Share it
Top