Home > తెలంగాణ > జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు.. రేవంత్ ప్రస్థానమిదే..

జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు.. రేవంత్ ప్రస్థానమిదే..

జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు.. రేవంత్ ప్రస్థానమిదే..
X

రాష్ట్ర రాజకీయాల్లో అతనో సంచలనం... ఆయన విమర్శల దాడికి ప్రత్యర్థులు ఆగం కావాల్సిందే. నిండా 20ఏండ్లు పొలిటికల్ కెరీర్ కూడా లేదు. అయినా ఎవరూ ఊహించని విధంగా పార్టీ రాష్ర్ట అధ్యక్ష పగ్గాలు చేపట్టాడు. ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా.. ఒంటరిగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ను మట్టి కరిపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాడు. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి సీఎంగా ఎదిగిన ఆయనే అనుముల రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరీర్ గురించి చాలా మందికి తెలుసు. కానీ రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఏం చేశారన్నది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డిది వ్యవసాయ కుటుంబం. హైదరాబాద్ లోని ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఏబీవీపీ స్టూడెంట్ లీడర్ గా చేశాడు. గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత రేవంత్ కొన్నాళ్లు ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేశాడు. దాదాపు 30 ఏండ్ల క్రితం “జాగృతి” అనే వార పత్రికలో పని చేస్తున్నప్పుడు రేవంత్‌ తోటి ఉద్యోగులతో తీసుకున్న ఫోటో ఇప్పుడు వైరల్‌ గా మారింది. బ్లాక్‌ కలర్‌ షర్ట్‌లో చిరునవ్వులు చిందిస్తున్న రేవంత్ ఫొటోను ఆయన అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు.



2004లో రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారభించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన.. 2006లో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జెల్ జెడ్పీటీసీగా పోటీ చేశారు. అయితే టీడీపీ నామినేషన్ తిరస్కరించటంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత 2008లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంఎల్‌సీగా విజయం సాధించి సంచలనం సృష్టించారు. అనంతరం మళ్లీ టీడీపీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లోనూ కొడంగల్ నుంచే బరిలో దిగి విజయం సాధించారు.

రాష్ట్ర విభజన తదనంతర పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు 2021లో రేవంత్ను టీపీసీసీ అధ్యక్ష పదవి వరించింది. కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టాక ఎన్ని విమర్శలు, ఆటంకాలు ఎదురైనా వాటన్నింటినీ తట్టుకొని పార్టీని ముందుకు నడిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. 119 స్థానాల్లో 64 సీట్లు కేవసం చేసుకుని సీఎం పగ్గాలు చేపట్టారు.

Updated : 5 Dec 2023 7:10 PM IST
Tags:    
Next Story
Share it
Top