కేసీఆర్ మేడిగడ్డకు రావాలి.. కావాలంటే డేట్ మార్చుతాం - సీఎం రేవంత్ రెడ్డి
X
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లారు. గత ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. గతంలో అబద్దాలతో బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందే వాస్తవాల బడ్జెట్ అని చెప్పుకొచ్చారు. ఐదేళ్లు అబద్ధాలతో పాలించడం కంటే.. తొలిరోజే నిజాలు చెప్పడం మేలని, నిజాలను మాత్రమే బడ్జెట్ తీసుకొచ్చామన్నారు. వాస్తవాలతో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ పెట్టినందుకు అభినందిస్తున్నామని రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం తెలంగాణను అబద్దపు పునాదుల మీద నడిపింది. పది పైసలతో అయ్యేదాన్ని.. పది రూపాయలు ఖర్చు దాకా తీసుకెళ్లి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. పదేళ్లలో ఎన్నో అవినీతి పనులు చేసింది. రాబోయే రోజుల్లో సచివాలయ భవనం, అంబేడ్కర్ విగ్రహం, అమర జ్యోతి నిర్మాణాలపై తప్పక విచారణ చేస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు.
త్వరలో రైతు బంధును అర్హులైన రైతులకు మాత్రమే అందేలా చూస్తామని రేవంత్ స్పష్టం చేశారు. అనర్హులకు రైతు భరోసా ఇవ్వబోమని.. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం తేల్చిచెప్పారు. రుణమాఫీ త్వరలోనే అందిస్తామని, ప్రస్తుతం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక్క ఇరిగేషన్ పై మాత్రమే.. రూ.16వేల కోట్లు మిత్తి కట్టాల్సి ఉందని చెప్పారు. త్వరలో ఇరిగేషన్ పై శ్వేత పత్రం విడుదల చేస్తామని అన్నారు.
మేడిగడ్డపై జుడిషియల్ విచారణ జరిపిస్తాం. విచారణ అనంతరం అన్ని నిజానిజాలు బయటికి వస్తాయి. ఫిబ్రవరి 13న బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు రావడం వీలుకాకపోతే.. ఇంకో డేట్ ఫిక్స్ చేస్తామని అన్నారు. మేడిగడ్డకు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేసీఆర్ ను ఆహ్వానించాం. ఆయన వస్తారా? ఆయన స్థానంలో ఎవరు వస్తారన్నది బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించుకుంటుంది. మేడిగడ్డ అవినీతి విషయాన్ని వదిలేది లేదని రేవంత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. రేవంత్ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేను ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ది కోసం చేయందిస్తే కలుపుకుని పోతామని చెప్పారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.