తెలంగాణకు ప్రపంచంతోనే పోటీ.. 100 ఏండ్ల భవిష్యత్కు ప్రణాళికలు : Revanth Reddy
X
తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలన్నదే తమ లక్ష్యమని , ఇతర రాష్ట్రాలతో పోటీనే లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం హోటల్ వెస్టిన్‌లో సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో ‘విద్య, నైపుణ్యాభివృద్ధి.. వ్యవస్థాపక అవకాశాలు’ అంశంపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, వ్యాపారవేత్తలకు కొత్త ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెట్టుబడులకు రక్షణ కల్పిస్తుందన్నారు. ఈ ప్రభుత్వం అందరిదని... ప్రజలందరూ కోరుకుంటేనే తాము వచ్చామన్నారు.
ఇందిరాగాంధీ విధానపరమైన నిర్ణయం తీసుకుని ఐడీపీఎల్‌ను ప్రారంభించినందునే ఫార్మా రంగంలో హైదరాబాద్ మెరుగైన స్థితిలో ఉందన్నారు రేవంత్ రెడ్డి. పాలకుల నిర్ణయాలు, విధానాలు రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పడతాయని చెప్పారు. అవుటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్) గురించి గతంలో మాట్లాడితే అవన్నీ అవసరమా అన్నారని.. ఇప్పుడు అదే హైదరాబాద్, తెలంగాణకు లైఫ్‌లైన్‌గా మారిందన్నారు. 100 ఏండ్ల రాష్ట్ర భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తున్నట్లు చెప్పారు సీఎం. ఫార్మా విలేజ్ లను డెవ్ లప్ చేస్తామని చెప్పారు. జహీరాబాద్ లో నిమ్స్ కు అనుమతులు వచ్చాయన్నారు. ఐఐటీలతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను అనుసంధానిస్తున్నట్లు చెప్పారు.