ధరణిపై సీఎం రేవంత్ రివ్యూ
X
ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సెక్రటేరియట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారితో పాటు రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ లోని లోపాలు, వాటిని ఎలా సవరించాలి, రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు వంటి పలు అంశాలపై సీఎం అధికారులతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ధరణి పోర్టల్ ను భూమాత పోర్టల్ గా మార్చేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ధరణికి సంబంధించిన పూర్తి మార్పులు చేర్పులను వీలైనంత త్వరగా పూర్తి చేసి రైతులు ఇబ్బుందుల పడకుండా చూడాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.
అయితే ధరణి పోర్టల్ ను మొత్తానికి తీసివేసి దాని స్థానంలో భూమాత పోర్టల్ ను తీసుకొస్తారా? లేక పాత పోర్టల్ లోని లోపాలను సవరించి 'భూమాత'గా మారుస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక భూసమస్యలను పరిష్కరించే దిశగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను తీసుకొచ్చింది. అయితే ధరణి వల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురయ్యారని, ధరణిని వెంటనే తొలగించి పాత పద్ధతిని పునరుద్ధరించాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన ప్రజా వాణిలో కూడా ధరణిని ఎత్తివేయాలంటూ వేల సంఖ్యలో వినతులు వచ్చాయి.