కంచర గాడిదను ఇంటికి పంపి రేసుగుర్రాన్ని తెచ్చుకున్నారు : రేవంత్
X
సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లు సీఎంగా ఉంటానని అన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పారు. కేసీఆర్ అధికారంలోకి ఎలా వస్తారో చూస్తానన్నారు. అసెంబ్లీకి రానివారికి అధికారం ఎందుకని రేవంత్ ప్రశ్నించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను సీఎం అందజేశారు. ఇంటికే నియామక పత్రాలు పంపొచ్చని హరీష్ రావు అంటున్నారని.. కానీ ఉద్యోగుల సంతోషంలో పాలుపంచుకోవాలనే స్వయంగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రజలు పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కంచెర గాడిదను ఇంటికి పంపి రేసుగుర్రాన్ని తెచ్చుకున్నామని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఏ సెంటిమెంట్ లేకపోవడంతో కృష్ణా నీళ్లు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు నష్టం చేసిందే కేసీఆర్ అని సీఎం ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారని కేసీఆర్ గుర్తించుకోవాలని ఎద్దేవా చేశారు.
యువకుల ఉద్యమం వల్లే తెలంగాణ ఏర్పడిందని.. కానీ గతంలో యువతను కేసీఆర్ పట్టించుకోలేదని రేవంత్ ఆరోపించారు. టీఎస్పీఎస్పీని ప్రక్షాళన చేశామని.. ఉద్యోగ నియామకాల్లో గత ప్రభుత్వ చిక్కుముళ్లను తొలగించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో యువతకు 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలే తమ కుటుంబం అని రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రజాప్రభుత్వం ప్రజాసమస్యలను పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు.