Group1: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వయోపరిమితి పెంపు
X
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరో శుభవార్తను అందించారు. ఇప్పటికే మరో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ఆయన.. గ్రూపు-1 నోటిఫికేషన్ పైనా స్పష్టత ఇచ్చారు. అతి త్వరలో పెంచిన పోస్టులతో గ్రూపు-1 నోటిఫికేషన్ ఇస్తామని శుక్రవారం అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. గ్రూపు-1 అభ్యర్థుల వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యమైందని అన్నారు.
నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో విపక్ష నేతలు 2లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారన్నారు ముఖ్యమంత్రి. జీరాక్స్ సెంటర్లలో ప్రశ్నాపత్రాలు అమ్మి ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్లం తాము కాదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఏ ఒక్క తప్పు కూడా రిపీట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. కాగా, ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం గ్రూపు-1 పోస్టులు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం మరో 60 గ్రూప్-1 పోస్టుల భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రెండుసార్లు రద్దయిన తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనుంది.