ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర పెద్దలను కలిసే ఛాన్స్
X
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తొలుత ఢిల్లీలో తనకు కేటాయించిన అధికార నివాసాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. తుగ్లక్ రోడ్ నంబర్ 23లో ఉన్న అధికారిక నివాసానికి తొలిసారి వెళ్లారు. మంగళ, బుధవారం ఢిల్లీలోనే సీఎం రేవంత్‌రెడ్డి ఉండనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను ఆయన కలవనున్నారు.
ఏఐసీసీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో రేవంత్ భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపికతో పాటు త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ పీఏసీ చేసిన తీర్మానాన్ని అధిష్ఠానానికి అందించనున్నారు.
పార్టీ నేతలతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను సైతం రేవంత్ కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలపైనా వారితో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం తిరిగి హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది.