CM Revanth Reddy : రేపు జార్ఖండ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!
X
(CM Revanth Reddy) రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర జార్ఖండ్లో కొనసాగుతోంది. ఈ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. రేపు ఆయన జార్ఖండ్ వెళ్తారని సమాచారం. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీ తర్వాత రేవంత్ పర్యటనపై స్పష్టత రానుంది. మరోవైపు జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే ఉన్నారు. జేఎంఎం - కాంగ్రెస్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలంతా శామీర్ పేటలోని లియోనియా రిసార్టులో ఉన్నారు. జార్ఖండ్లో కొలువుదీరిన చంపై సోరెన్ ప్రభుత్వం 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆదేశించారు. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేలకు ఇతర పార్టీలు గాలం వేయకుండా జేఎంఎం - కాంగ్రెస్ పార్టీలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తమ కూటమి ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్కు తరలించారు.
జార్ఖండ్ అసెంబ్లీలో రేపు బలపరీక్ష జరగనుంది. రేపటివరకు ఎమ్మెల్యేలంతా హైదరాబాద్లోనే ఉండనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఈ ఎమ్మెల్యేల కో ఆర్డినేషన్ బాధ్యతను పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్కు అప్పగించింది. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుతం జేఎంఎంకు 29 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్ కు 17, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఐఎంల్ కు చెరొక ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. ఇక బీజేపీ బలం 26 కాగా, ఏజేఎస్యూకు 3, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. జేఎంఎం, కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఐఎంల్ కూటమికి 49 మంది సభ్యులు ఉండగా.. ప్రతిపక్ష పార్టీలకు 31 మంది సభ్యుల బలం ఉంది. అయితే డిసెంబర్ 31న మనీలాండరింగ్ స్కాంలో హేమంత్ సోరెన్ అరెస్ట్ కావడంతో జార్ఖండ్లో రాజకీయం హీటెక్కింది. నాటకీయ పరిణామాల మధ్య చంపై సోరెన్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.