CM Revanth reddy: వాళ్లకు 9 నెలలు పట్టింది.. మేం వచ్చి 60 రోజులు కూడా కాలేదు
X
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతుబంధు విషయంపై కీలక ప్రకటన చేశారు. ఆలస్యమైనా.. ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. గతంలోనూ రైతుబంధు డబ్బులు అందరికీ పడేందుకు కొంత సమయం పట్టేదని..ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అన్నారు. 2018లో యాసంగి పంట రైతుబంధు వేసేందుకు 5 నెలలు పట్టిందని రేవంత్ రెడ్డి చెప్పారు. "2020లో జనవరి 28న మొదలుపెట్టి.. అక్టోబరు 23న పూర్తి చేశారు. అప్పుడు ఏకంగా 9 నెలలు పట్టింది. 2021, 2022లో కూడా యాసంగి పంటకు రైతుబంధు వేసేందుకు 4 నెలలు పట్టింది. ఇప్పుడు మేం అధికారంలోకి వచ్చి.. 60 రోజులు కూడా కాలేదు.. అప్పుడే మాపై విమర్శలు చేస్తున్నారని" రేవంత్ రెడ్డి విమర్శించారు.
రైతుబంధు ఇంకా పడలేదని రైతులను ప్రతిపక్ష నేతలు రెచ్చగొడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 100 రోజుల్లో కచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని అన్నారు. కాగా, రైతుబంధు డబ్బులను మొదట తక్కువ భూవిస్తీర్ణం ఉన్న రైతుల నుంచి మొదలుకొని..ఎక్కువ భూవిస్తీర్ణం ఉన్న రైతులకు విడుదల చేస్తున్నారు. ఐతే రెండున్నర ఎకరాల లోపు వారికే ఇప్పటి వరకు డబ్బులు అందాయి. మిగలిన వారికి ఇంకా పడలేదు. ఈ నెలాఖరు వరకు అందరికీ వేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ప్రస్తుతం రైతుబంధు కింద ఏటా ఎకరాకు రూ.10వేలు ఇస్తుండగా.. ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకం కింద ఏటా ఒక్కో రైతుకు రూ.15వేల చొప్పున అందజేస్తారు. వానాకాలం, యాసంగి సీజన్లలో ఎకరాకు రూ.7,500 చొప్పున ఇస్తారు. ఈ పథకాన్ని వచ్చే వానకాలం సీజన్ నుంచే అమలు చేయాలని భావిస్తున్నారు. వేసవి ముగిసిన జూన్ నెల ప్రారంభంలో తెలంగాణకు నైరుతి పవనాలు వస్తాయి. ఆ తర్వాత వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచే రైతుభరోసా నిధులను పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది.