తెలంగాణను దోచుకున్న ఎవరినీ వదిలిపెట్టను.. CM Revanth Reddy
X
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ‘జన జాతర’ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను తాత, తండ్రి పేరు చెప్పుకొని పైకి రాలేదని.. అవినీతి పరులను, దుర్మార్గులను తొక్కుకుంటూ పైకొచ్చానని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రేవంత్ పేరు చెబితే.. 3 సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్ చెప్పారు. ఆయనకు చేవెళ్ల సభ నుంచి సవాల్ విసురుతున్నా. దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటయినా గెలిపించి చూపించాలి. రేవంత్‌రెడ్డి అంటే అల్లాటప్పా అనుకోవద్దు. తండ్రి పేరు చెప్పి పదవిలో కూర్చున్న వ్యక్తిని కాదు. కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగాను. చంచల్‌గూడ జైలులో పెట్టినా.. లొంగిపోకుండా పోరాడాను. నల్లమల అడవుల నుంచి దుర్మార్గులు, అవినీతిపరులను తొక్కుకుంటూ వచ్చాను. కార్యకర్తల అండ ఉన్నంతకాలం నా కుర్చీని ఎవరూ తాకలేరు’’ అని స్పష్టం చేశారు. తెలంగాణను దోచుకున్న ఎవరినీ వదిలిపెట్టబోను అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రాన్ని దోచుకున్న వారికి ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పారు.. ఇక మా వాటా ఇవ్వాల్సి ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం కూలిపోతుంది అని ఎవరైనా అంటే తన్నండి అని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.
గత ప్రభుత్వంలో అణచివేతకు గురికాని వర్గమంటూ లేదని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కార్యకర్తల శ్రమ, రక్తం ఉందని.. వాళ్ల రుణం తీర్చుకుంటామని తెలిపారు. ఎంపీలను గెలిపించడంతోనే తమ బాధ్యత తీరిపోదని, పార్టీ జెండా మోసిన వారికి న్యాయం చేస్తామని వెల్లడించారు. ‘‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? కేడీ.. మోదీ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. ఇద్దరూ కలిసి కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు నాటకాలు ఆడుతున్నారు. త్వరలో మెగా డీఎస్సీ వేసి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మళ్లీ ఇందిరమ్మ కమిటీలను పునరుద్ధరిస్తాం. కాంగ్రెస్ అభయహస్తం హామీలను ఇంటింటికీ కార్యకర్తలు తీసుకెళ్లాలి’’ అని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర మహిళల కళ్లల్లో నీళ్లు రావొద్దని రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని అన్నారు. కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కలిగించాలనే ఆనాడు యూపీఏ ప్రభుత్వం భావించిందని గుర్తుచేశారు. కేవలం రూ.1500 లకే దేశంలోని పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణలో గ్యాస్ సిలిండర్ పథకానికి ఇప్పటికే 40 లక్షల మందిని గుర్తించామని అన్నారు. ఎవరికైనా పథకం అందకపోతే మండల కార్యాలయానికి వెళ్లి పేర్లు రాయించుకోవాలని సూచించారు.