మూసీ అభివృద్ధిపై థేమ్స్ నది అధికారులతో రేవంత్ రెడ్డి చర్చలు
X
సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన కొనసాగుతోంది. థేమ్స్ నది అభివృద్ధిపై రేవంత్‌రెడ్డి అధ్యయనం చేశారు. థేమ్స్ నది చరిత్ర, ఇంజినీరింగ్, పెట్టుబడి, ఆదాయం వంటి అంశాలను లండన్ పోర్టు అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం మూసీ నది అభివృద్ధిపై థేమ్స్ నిర్వహణ అధికారులు, నిపుణులతో రేవంత్ చర్చలు జరిపారు. మూసీ పరీవాహక అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం తెలిపారు. మూసీకి పునర్వైభవం వస్తే హైదరాబాద్ మరింత శక్తిమంతమవుతుందని సీఎం వివరించారు. ఈ క్రమంలో మూసీ అభివృద్ధికి సహకరిస్తామని లండన్ అధికారులు హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి గురువారం లండన్ చేరుకున్నారు. లండన్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. లండన్లో పలువురు ఇన్వేస్టర్లతో సమావేశమై.. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నారు. అంతకుముందు దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రేవంత్ పాల్గొన్నారు. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. వెబ్ వర్క్స్, అదానీ గ్రూప్, గోడీ ఇండియా, గోద్రేజ్, టాటా గ్రూప్ వంటి సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.