CM Revanth Reddy : ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. సోనియా గాంధీతో సమావేశం..
X
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి సోనియా నివాసానికి వెళ్లారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఉదయం జార్ఖండ్లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న నేతలు.. ఆ తర్వాత ఢిల్లీకి చేరుకుని సోనియా నివాసానికి వెళ్లారు.
మరో రెండు నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయాలని రేవంత్, భట్టి కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే తీర్మానం చేసింది. మరోవైపు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నడుస్తున్న తీరు గురించి సోనియా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరుతో పాటు ప్రభుత్వ, పార్టీపరంగా ఎలా ముందుకెళ్తున్నామన్న అంశాలను నేతలు సోనియాకు వివరించారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 17 సీట్లలో మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం గాంధీ భవన్‌లో రేవంత్రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం ఉన్నందున ఆయన ఇవాళ రాత్రికే తిరిగి రానున్నారు.