CM Revanth Reddy : సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
X
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్(Sant sevalal maharaj) జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గురువారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్(Banjarahills)లోని సంత్ సేవాలాల్ భవన్‌లో నిర్వహించిన వేడుకలకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరిపేందుకు రూ.2 కోట్లు విడుదల చేస్తున్నామని, తక్షణమే జీవో మంజూరు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు.
యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సేవాలాల్ మహారాజ్ అని అభివర్ణించారు సీఎం. సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. బంజారా సోదరులను కలవడమంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్నంత ఆనందంగా ఉందన్నారు.
సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న, అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి దగ్గరున్న సేవాగఢ్‌లో జన్మించారన్నది బంజారాల విశ్వాసం. ఆయన గొప్ప సంఘ సంస్కరణవాది. ఆధ్యాత్మిక గురువు. బ్రహ్మచారి అయిన సేవాలాల్.. విశిష్ట బోధనలతో యశస్సును పొందారు. ఆయన్ను చాలా మంది భక్తులు అనుసరించేవారు. బంజారాల హక్కులు, నిజామ్, మైసూరు పాలకుల దాష్టీకాలకు వ్యతిరేకంగా.. 18వ శతాబ్దంలో సాగిన పోరాటంలో సంత్ సేవాలాల్ కీలక పాత్ర పోషించారు.