క్రిస్మస్ వేడుకల్లో రేవంత్.. అర్హులైన వారికి అవకాశాలు ఇస్తామన్న సీఎం
X
ప్రపంచానికి డిసెంబర్ మిరాకిల్ నెల అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలోనూ డిసెంబర్ నెలలో అద్బుతం జరిగిందని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు.
క్రైస్తవులు, మైనార్టీలు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావాలని కోరుకున్నారని.. వారు అనుకున్నట్లుగానే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. నిస్సహాయులకు సాయం అందించండమే తమ ప్రభుత్వ ధ్యేయమని రేవంత్ స్పష్టం చేశారు. అర్హత కలిగిన వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు.
తెలంగాణలో ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యం.. పేదల అభివృద్ధికి పాటు పడుతుందని రేవంత్ చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రతీ పేదవాడికి చేరేలా చూస్తామన్నారు. తాము పాలకులం కాదు.. సేవకులం అని అన్నారు. ఏసు క్రీస్తు అందరికీ ఆదర్శమని.. బాధ్యతలను మరవకుండా పనిచేస్తూ ముందుకెళ్తామని చెప్పారు. సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని.. ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకరావాలని సూచించారు. మొన్న కర్ణాటక.. నిన్న హిమాచల్ ప్రదేశ్... నేడు తెలంగాణలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ రావాలని కోరుకోవాలని ప్రజలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. దేశంలో మణిపూర్ సంఘటన.. ప్రస్తుత బీజేపీ వైఖరిని తెలియజేస్తుందని విమర్శించారు. మణిపూర్లో జరుగుతున్న సంఘటనలను పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో మునిగిపోయిందని మండిపడ్డారు. మణిపూర్ బాధితులను పరామర్శించడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తే అడ్డుకున్నారన్నారు. మణిపూర్ లాంటి ఘటనలు దేశంలో ఎక్కడా జరగకుండా చూడాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని చెప్పారు.