CM Revanth Reddy : ఐనవోలు బ్రహ్మత్సవాలకు సీఎం రేవంత్ కు ఆహ్వానం
X
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ ఆలయ కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందజేసింది. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మల్లన్న కల్యాణానికి రావాలని కోరారు. వారితో పాటు రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేపీ నాగరాజు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఐనవోలు జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఇక వీలు చూసుకొని జాతరకు వస్తానని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. కాగా జనవరి 13 నుంచి ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు జరగనుండగా.. ఆలయ ప్రాంగణంలో ఆదివారం జాతర ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. మంత్రి హోదాలో తొలిసారిగా ఆలయానికి వచ్చిన కొండా సురేఖకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఇతర నాయకులు, అధికారులు ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జాతర ఏర్పాట్లకు తీసుకోవాల్సిన చర్యలపై దేవాదాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, ఆరోగ్య, పోలీసు, ఎక్సైజ్, నీటిపారుదల, మిషన్ భగీరథ, ఆర్టీసీ, రోడ్లు భవనాలు, మున్సిపల్, కుడా అధికారులతో మంత్రి సురేఖ సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు చేపట్టాల్సిన పనుల గురించి వివరించారు.