విద్యుత్ రంగంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
X
విద్యుత్ రంగంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో పాటు ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల స్థితిగతులు, డిమాండ్, కొనుగోళ్లు, బకాయిల గురించి ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను వివరాలు అడిగారు. విద్యుత్ రంగంపై ఆ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మరో రెండు గ్యారంటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచే అంశాలపై ఆయా శాఖల అధికారులతో చర్చిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రమాణస్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన తొలి మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పనితీరుపై వాడీవేడి చర్చ జరిగింది. కేసీఆర్ హయాంలో విద్యుత్ రంగానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఆ శాఖలో వాస్తవాలను వెల్లడించకుండా చాలాకాలంగా దాచిపెట్టడాన్ని తప్పుపడుతూ.. ఆ శాఖ ఉన్నతాధికారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.