Home > తెలంగాణ > వరుస సమీక్షలతో సీఎం బిజీ బిజీ

వరుస సమీక్షలతో సీఎం బిజీ బిజీ

వరుస సమీక్షలతో సీఎం బిజీ బిజీ
X

సీఎం పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూ పాలనపై పట్టు బిగిస్తున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీల అమలుపై రివ్యూ నిర్వహించిన సీఎం.. తాజాగా వ్యవసాయ శాఖ, ఉద్యోగాల భర్తీ, డ్రగ్స్ నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు సీఎం శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎంవో కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు భరోసా అమలుపై సీఎం వారితో చర్చించారు.

రైతు భరోసా నిధుల సేకరణ, రైతుల అకౌంట్లలో జమ వంటి పలు అంశాలపై సీఎం మంత్రులు, అధికారులతో చర్చించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ ఎన్నికలకు ముందే రైతుల అకౌంట్లలో పడాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ వల్ల ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇక ఎన్నికల ముందైతే ఎకరానికి విడతకి రూ.5 వేలు ఇవ్వాల్సి ఉండగా.. తాజాగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి విడతకు రూ.7500 ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ పెంచిన అమౌంట్ నే రైతుల ఖాతాల్లో వేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం.

వ్యవసాయ శాఖ రివ్యూ తర్వాత ఉద్యోగాల భర్తీపై సీఎం రివ్యూ నిర్వహించారు. ప్రజాదర్బార్ లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ పని తీరు, ఉద్యోగాల భర్తీ, పరీక్షల్లో మార్పులు వంటి అనేక అంశాలపై సీఎం సమీక్షలో చర్చించారు. జనవరిలో గ్రూప్ 2 పరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. అనంతరం విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆ విభాగానికి చెందిన నార్కోటిక్స్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ వల్ల పెరుగుతున్న క్రైంను ఏ విధంగా అరికట్టాలి? డ్రగ్స్ వినియోగాన్ని ఎలా అరికట్టాలి? అన్న పలు అంశాలపై సీఎం సంబంధిత అధికారులతో చర్చించారు.తెలంగాణని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులు, పోలీసులను ఆదేశించారు.



Updated : 11 Dec 2023 8:32 PM IST
Tags:    
Next Story
Share it
Top