బీఆర్ఎస్ చాలాసార్లు బీజేపీకి అండగా నిలిచింది : CM Revanth Reddy
X
గత పదేళ్లలో బీఆర్ఎస్ చాలాసార్లు బీజేపీకి అండగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం తెచ్చిన ఎన్నో బిల్లులకు మద్దతు పలికిందని ఆరోపించారు. బీజేపీ - బీఆర్ఎస్ లది ఫెవికాల్ బంధం అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాటలకు ఆయన సమాధానమిచ్చారు. సీఎంను మార్చే విషయం కూడా మోదీకి కేసీఆర్ చెప్పారని విమర్శించారు. ఆ విషయాన్ని స్వయంగా మోదీయే చెప్పారని రేవంత్ అన్నారు.
సొంత పార్టీ నేతలకు కేసీఆర్ అన్నీ విషయాలు చెప్పరని... కావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన దగ్గరకు వస్తే అన్నీ విషయాలు చెప్తానని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని పోచారం అన్నారు.
సీఎంను మార్చడానికి తమకు ఎవరి పర్మిషన్ అవసరం లేదని.. గతంలో తమకే ఫుల్ మెజార్టీ ఉండేదని గుర్తు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే గుర్తుచేస్తున్నామని.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాభివృద్ధికి తాము కూడా సహకరిస్తామని స్పష్టం చేశారు.