గాంధీ కుటుంబం ప్రాణ త్యాగాలు చేస్తుంటే.. మోదీ ఎక్కడున్నాడు: సీఎం రేవంత్ రెడ్డి
X
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. గురువారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మాట్లాని సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంచినట్లు గుర్తుచేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో మరో 2 గ్యారంటీలను అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఫిబ్రవరి నెలాఖరులోగా అర్హులైన అందరికీ రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రేవంత్.. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసిందని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చిందన్నారు. అయినా తమ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో ఏ రంగాన్ని అభివృద్ధి చేయలేదని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన 50 రోజులు కాకముందే తమపై విమర్శించడం కరెక్ట్ కాదని రేవంత్ అన్నారు. తనను గుంపు మేస్త్రీ అంటూ బీఆర్ఎస్ చేస్తున్న ట్రోలింగ్ పై స్పందించిన సీఎం రేవంత్.. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ‘ఔను.. నేను మేస్త్రీనే. తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీని. ఇదే కాదు.. బీఆర్ఎస్ నేతల్ని వందమీటర్ల గోతిలో పాతిపెట్టి, గోరీ కట్టే మేస్త్రీని. ఈనెలాఖరులో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి వస్తున్నా కాస్కోండి’ అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దేశంలో త్యాగం అంటే గాంధీ కుటుంబానిది అన్నారు రేవంత్. రాజీవ్ వీర మరణం తర్వాత ప్రజల కోసం సోనియా గాంధీ ముందుకొచ్చారని అన్నారు. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినప్పుడు.. ప్రధాని మోదీ ఎక్కడున్నారని ప్రశ్నించారు.
2004, 2009లో ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా.. సోనియా గాంధీ వాటిని వదులుకుందన్నారు. ఇలా ఎన్నో పదవులను త్యాగం చేసిన ఘనత వారిదని చెప్పుకొచ్చారు. సోనియా, రాహుల్ గాంధీలను వేదించేందుకే మోదీ.. ఈడీ, సీబీఐ కేసులు పెడుతున్నారని రేవంత్ ఆరోపించారు. రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా పార్టీ గెలుస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.