Home > తెలంగాణ > CM Revanth Reddy : పదేళ్లలో రాష్ట్రానికి చెదలు పట్టించారు - సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : పదేళ్లలో రాష్ట్రానికి చెదలు పట్టించారు - సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : పదేళ్లలో రాష్ట్రానికి చెదలు పట్టించారు - సీఎం రేవంత్ రెడ్డి
X

బీఆర్ఎస్ పార్టీ పదేండ్లలో రాష్ట్రాన్ని దివాళా తీయించిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రానికి చెదలు పట్టించారని మండిపడ్డారు. దోచుకోవాలి దాచుకోవాలన్న ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని విమర్శించారు. అసెంబ్లీలో సాగునీటిపై విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చలో భాగంగా మాట్లాడిన రేవంత్.. బీఆర్ఎస్ నాయకులపై, వారి పాలనపై ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలోని ప్రాజెక్టులపై వాస్తవాలను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ ముందు పెట్టే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని రేవంత్ మండిపడ్డారు. వాస్తవాలను తప్పుల తడకలని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకుంటే మంచిదని సూచించారు.

గోదావరి నదిపై ప్రాజెక్టుల గురించి ఐదుగురు రిటైర్డ్ ఇంజనీర్లతో కేసీఆర్ కమిటీ వేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. వారు ఇచ్చిన రిపోర్టును గత ముఖ్యమంత్రి ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నించారు. మేడిగడ్డ ఆలోచన కేసీఆర్ దేనని, వాస్తవానికి ఇంజనీర్లు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిరుపయోగమని, దాని బదులు తమ్మిడిహట్టి దగ్గర నిర్మిస్తే మంచిదని ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్టును సభలో చదివి వినిపించారు. అయితే కేసీఆర్ మాత్రం ఆ రిపోర్టును తొక్కిపెట్టి మేడిగడ్డ నిర్మించడం వల్లే పిల్లర్ నిలువునా చీలిపోయిందని రేవంత్ మండిపడ్డారు.

నీళ్ల కోసమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక మంది కాంగ్రెస్ నాయకులు కొట్లాడారని అన్నారు. తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమేనని స్పష్టంచేశారు. పార్లమెంటులో పెప్పర్ స్ప్రే బిరిన పడ్డది తమ ఎమ్మెల్యేనని, అసలు సభలో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడో చెప్పాలని నిలదీశారు. పదేళ్లలో హరీశ్ మారాడని అనుకున్నానని కానీ అలా జరగలేదని అన్నారు. కడియం శ్రీహరి మంచోడే అయినా బీఆర్ఎస్ బడిలో చేరి చెడిపోయాడని రేవంత్ సటైర్ వేశారు.




Updated : 17 Feb 2024 8:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top