Home > తెలంగాణ > CM Revanth Reddy : మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్‌

CM Revanth Reddy : మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్‌

CM Revanth Reddy : మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్‌
X

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో నేడు మరో కీలక అడుగు ముందుకు పడింది. ఇప్పటికే రెండు పథకాలు అమలు చేస్తున్న రేవంత్ సర్కార్... నేడు మరో రెండింటికి శ్రీకారం చుట్టింది. గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, మహాలక్ష్మిలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అయితే మొదట ఈ రెండు పథకాలను రంగారెడ్డి చేవెళ్లలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభా వేదికగా ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ సోమవారం రాత్రి ఆ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వేదిక మార్చాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే సచివాలయంలో రెండు గ్యారంటీ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రజా పాలనలోదరఖాస్తు చేసిన తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ పథకాలను వర్తింపచేయనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ ఈ సందర్భంగా తెలిపారు. అభయ హస్తం ద్వారా ఆరు గ్యారంటీలు ప్రకటించామని చెప్పిన సీఎం .. రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారు. అర్హత ఉండి ఎవరైనా దరఖాస్తు చేయకపోయి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని, ఎమ్మార్వో కార్యాలయాల్లోకి వెళ్లి ప్రజాపాలన అధికారికి ఎప్పుడైనా దరఖాస్తు ఇవ్వొచ్చని అన్నారు.

అంతకు ముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొన్నేళ్లుగా దేశంలో గ్యాస్‌ సిలిండర్ ధర భారీగా పెరిగిందని అన్నారు. పెరిగిన ధరల నుంచి మహిళలకు ఊరట కల్పించాలని భావించామని, అందుకే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ స్కీమ్‌తో 40 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. లోపాలు గుర్తించి పథకంలో మార్పులు చేసుకుంటూ వెళ్తామని వెల్లడించారు. త్వరలో నేరుగా లబ్ధిదారులు రూ.500కే సిలిండర్‌ పొందేలా ఏర్పాట్లు చేస్తామని వివరించారు.

పేదలకే ఎక్కువ ఉపయోగం కలిగేలా ఆరు గ్యారంటీలు ప్రకటించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌ అమలు చేస్తున్న పథకాల వైపు దేశమంతా చూస్తోందని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తన హామీలను అమలు చేయదని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేసిందని, కానీ తాము అన్ని గ్యారంటీల అమలు కోసం నిత్యం కృషి చేస్తున్నామని చెప్పారు. పేదలకు పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు ఇస్తూ గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఉచిత కరెంటు ఇస్తామని, 200లోపు యూనిట్లు వాడే అందరికీ మార్చిలో జీరో బిల్లు వస్తుందన్నారు. అర్హత ఉండి ఎవరైనా దరఖాస్తు చేయకపోయి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. మండల కార్యాలయాల్లోకి వెళ్లి ప్రజాపాలన అధికారికి ఎప్పుడైనా దరఖాస్తు ఇవ్వొచ్చని భట్టి విక్రమార్క అన్నారు.

Updated : 27 Feb 2024 5:17 PM IST
Tags:    
Next Story
Share it
Top