Home > తెలంగాణ > సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. తెలంగాణలో కొత్త ఇసుక పాలసీ!

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. తెలంగాణలో కొత్త ఇసుక పాలసీ!

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. తెలంగాణలో కొత్త ఇసుక పాలసీ!
X

తెలంగాణలో ఇసుక అమ్మకాలకు సంబంధించి కొత్త పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా విధివిధానాలు ఉండేలా కొత్త పాలసీ సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని అన్నారు. అన్ని స్థాయిలో అక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న ఇసుక క్వారీయింగ్, అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 48 గంటల్లో అన్ని స్థాయిల్లో కూడా అధికారులు తమ పద్దతి మార్చుకోవాలని డెడ్‌లైన్ విధించారు. రెండు రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపాలను అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లోనూ వెంటనే తనిఖీలు చేపట్టి బాధ్యులు ఏ ఒక్కరినీ వదిలిపెట్టొద్దని సీఎం హెచ్చరించారు. టోల్ గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా ఇసుక లారీల అక్రమ రవాణాను మొత్తం బయటకు తీయాలని సూచించారు.

ఇసుక రీచ్‌లు, డంప్‌లల్లో తనిఖీలు చేపట్టాలని, తప్పులుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. రవాణా విభాగంలో ఈనెల 3వ తేది నుంచి నిజామాబాద్, వరంగల్ రూట్లలో ఆకస్మిక తనిఖీలు చేయించినట్లు చెప్పుకొచ్చారు. అందులో భాగంగా 83 ఇసుక లారీలను తనిఖీ చేస్తే 22 లారీలకు మాత్రం అనుమతి లేదని గుర్తించామన్నారు. 25 శాతం అక్రమంగా ఇసుక తరలిపోతోందన్నారు. ఇసుక మాఫియాను రాష్ట్రంలో సమూలంగా నిర్మూలించాలని, అక్రమాలను అరికట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


Updated : 8 Feb 2024 4:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top