ఇవాళ ఇంద్రవెల్లికి రేవంత్.. మూడు గ్యారెంటీల అమలుపై కీలక ప్రకటన
X
ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ ప్రకారం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. మరో మూడింటిని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీటి అమలుపై అధికారులతో సీఎం సమావేశమై చర్చించారు. ఇవాళ రేవంత్ ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం హోదాలో రేవంత్కు ఇదే తొలి జిల్లా పర్యటన కావడం విశేషం.
ఇవాళ మధ్యాహ్నం 12.20కు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి సీఎం రేవంత్ హెలీ కాఫ్టర్లో బయలుదేరుతారు. 1.30లకు కేస్లాపూర్ చేరుకుని.. అక్కడి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి.. స్మృతివనానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక్కడి నుంచే ఆయన పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
మూడు గ్యారెంటీలపై ప్రకటన!
ఇక ఈ సభలోనే మరో మూడు గ్యారెంటీలను సీఎం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇందిరమ్మ ఇల్లు, రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ హామీల అమలుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్, రాజీవ్ ఆరోగ్య శ్రీని రూ.10లక్షలకు పెంచిన రేవంత్ సర్కార్.. మరో మూడింటిని అమలు చేసి ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఈ గ్యారెంటీల అమలుపై అధికారులతో రేవంత్ సమావేశమై చర్చలు జరిపారు. మిగితా గ్యారెంటీలను సైతం 100రోజుల్లో అమలు చేసేలా ప్రణాళికలు వేస్తోంది.
ఇంద్రవెల్లి సెంటిమెంట్ !
మరోవైపు ఇంద్రవెల్లిని రేవంత్ సెంటిమెంట్ గా భావిస్తారు. ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత చేపట్టిన ‘‘దళిత - గిరిజన దండోరా’’ తొలి సభను ఇంద్రవెల్లిలోనే నిర్వహించారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సభ ఇచ్చిన జోష్తో వరుస సభలతో హోరెత్తించారు. మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.