Home > తెలంగాణ > CM Revanth Reddy : చేవెళ్ల కాంగ్రెస్ జన జాతర వేదికగా గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : చేవెళ్ల కాంగ్రెస్ జన జాతర వేదికగా గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : చేవెళ్ల  కాంగ్రెస్ జన జాతర వేదికగా గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
X

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో నిర్వహించిన సభలో సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంధీ పర్యటనరద్దు కావడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి చేవెళ్ల ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసిందని మండిపడ్డారు. తమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును నిపుణులు, ఇంజినీర్లు వద్దంటున్నా.. మేడిగడ్డ వద్ద కట్టారన్నారు. అద్భుతంగా కట్టామని కేసీఆర్‌ చెప్పిన ప్రాజెక్టులు ఇవాళ పగుళ్లు పట్టాయని, రూ. లక్ష కోట్ల నిధులు గోదావరిలో పోసి వృథా చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు అడ్రెస్ లేకుండా కొట్టుకుపోతాయని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వంలో అణిచివేతకు గురైన అందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో ఎందరో కార్యకర్తల శ్రమ, రక్తం ఉందని తెలిపారు. కార్యకర్తల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోనని.. వాళ్ల రుణం తీర్చుకొని తీరుతానని మాటిచ్చారు. సోనియా గాంధీ సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణకు వచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లో రెండు కీలక హామీలు అమలు చేస్తామని అన్నారు. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు. ఇచ్చిన మాటను అటు సోనియా గాంధీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏనాడూ తప్పలేదని గుర్తుచేశారు. మన చిరకాల కోరిక అయిన తెలంగాణ ఇచ్చి కోట్లాది ప్రజల ముఖాల్లో చిరున్వవ్వు నింపారని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. ఇవాళ పేద ప్రజలు సైతం పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకుంటున్నారని అన్నారు. పేదల గురించే కాదు.. నిరుద్యోగుల గురించి కూడా కేసీఆర్ ఏనాడు ఆలోచించలేదని మండిపడ్డారు. కేవలం తన కుటుంబసభ్యులకు మాత్రమే అందరికీ ఉద్యోగాలు ఇప్పించుకున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 25 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే మెగా డీఎస్సీ వేసి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

సభలో అంతకుముందు మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశామని, ఇవాళ మరో రెండు పథకాలను ఈ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. రూ. 500కే గ్యాస్‌ సిలిండర్ పథకం ఇవాళ ప్రారంభించామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా తమ ప్రణాళికలు సాగుతున్నాయని.. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రజలంతా కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండాలని కోరారు. కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్‌ ఈ పదేళ్లలో తెలంగాణకు ఇచ్చిందేమీ లేదన్నారు. విభజన హామీలు నెరవేర్చని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. అభయహస్తంలోని ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామని మిగిలిన కాంగ్రెస్ మంత్రులు చెప్పారు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదని, ఖజానా ఖాళీ ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణతో పని చేస్తూ.. నిధులు సమకూర్చుకుని ప్రజలకు మేలు చేస్తున్నామన్నారు.

బీజేపీ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌ వచ్చేది లేదు.. ఇచ్చేది లేదు అని వెటకారంగా మాట్లాడారని, ఇప్పటికీ కూడా తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మహిళల పట్ల సంస్కారహీనంగా మాట్లాడారన్నారు. ఒక మంత్రి తల్లి పట్ల బీజేపీ నేత సంస్కారహీనంగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. అంతకుముందు సచివాలయంలో ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా మరో రెండు పథకాలకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచితవిద్యుత్‌, మహాలక్ష్మిలో భాగంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. చేవెళ్లలో వాటిని ప్రారంభించాలని భావించినా, ఎమ్మెల్సీ ఎన్నికకోడ్ అమల్లోకి రావడంతో వేదిక మార్చారు.

Updated : 27 Feb 2024 2:06 PM GMT
Tags:    
Next Story
Share it
Top