CM Revanth Reddy : పోలీసు నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
X
పోలీసు నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పోలీసు నియామకాల్లో జీవో నెం.46 రద్దుపై సాధ్యాసాధ్యాల గురించి చర్చించారు. త్వరలో కొన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మాట్లడారు. రెవెన్యూ జిల్లాల జనాభాను ప్రాతిపదికగా చేసుకొని టీఎస్‌ఎస్పీ పోస్టులు కేటాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనలున్నాయి. కటాఫ్ మార్కుల్లో వ్యత్యాసంతో రాజధాని ప్రాంతానికే ఎక్కువ జాబ్‌లు దక్కుతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్ ఎస్పీ పోస్టులు రాష్ట్రస్థాయివని.. కటాఫ్ మార్కులను సైతం రాష్ట్రస్థాయిలోనే పరిగణించాలని డిమాండ్లు ఉన్నాయి. టీఎస్‌ఎస్పీ నియామకాల్లో జీవో నంబర్ 46ని మినహాయించాలని కోరుతున్నారు. కొత్త జిల్లాల మేరకు ఉద్యోగుల భర్తీ జరగాలనే రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో సీడీసీ అంశం తెరమీదికి వచ్చింది. టీఎస్ ఎస్పీ బెటాలియన్లు అన్ని జిల్లాలో లేకపోవడంతో పొరుగున ఉన్న మూడు, నాలుగు జిల్లాలను కలుపుతూ సీడీసీ కేడర్‌ను నిర్ణయించారు.
రెవెన్యూ జిల్లాల వారీగా జనాభాను పరిగణలోకి తీసుకొని పోస్టులను భర్తీ చేస్తుండడంపై పలువురు అభ్యంతరం చెబుతున్నారు. జనాభా ప్రాతిపదికన పోస్టులను కేటాయిస్తే గ్రామీణ జిల్లాలకు తక్కువ పోస్టులు రానుండగా.. దాంతో అక్కడ కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయి. ఫలితంగా ఎక్కువ మార్కులు సాధించినా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం కోల్పోతామని పలువురు అభ్యర్థులు అభ్యంతరం తెలుపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఎక్కువగా పోస్టులు ఉండడం.. తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చే అవకాశం ఉండడంతో తమకు అన్యాయం జరుగుతుందని గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, TSLPRB చైర్మన్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, మక్కన్ సింగ్ ఠాగూర్, ఎమ్మెల్సీ వెంకట్ పాల్గోన్నారు