తెలంగాణలో కోకా కోల పెట్టుబడులు డబుల్
X
తెలంగాణలో తమ పెట్టుబడులు డబులు చేసేందుకు కోకా కోల సంస్థ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో విస్తృతంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఈ సంస్థ లేటెస్టుగా అదనపు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్‌ను ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో న్యూయార్క్ సిటీలో జరిగిన సమావేశంలో కోకా కోలా తన ప్రణాళికలను తెలిపింది. రాష్ట్ర సర్కార్ అందిస్తున్న సహకారానికి తోడు, వేగవంతంగా జరుగుతున్న ప్లాంట్ నిర్మాణ పనులు, బిజినెస్ డెవలప్మెంట్ను దృష్టిలో ఉంచుకొని కోకా కోలా కంపెనీ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సిద్దిపేట జిల్లా ప్లాంట్‌లో అదనంగా మరో రూ.647 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు రెడీ అయ్యింది.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో కోకా కోలా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ మేక్ గ్రివి మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..." ప్రపంచంలో మా మూడవ అతిపెద్ద మార్కెట్ భారత్. మా బిజినెస్‌ను మరింతగా విస్తరించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాం. అందుకే తెలంగాణలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డబుల్ చేస్తున్నాం. అమీన్పూర్ కంపెనీలో ఉన్న భారీ బాటిలింగ్ ప్లాంట్ విస్తరణకు అప్పట్లోనే రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాం. సిద్దిపేటలో రూ.1000 కోట్లతో నూతన బాటిలింగ్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ కోసం ఏప్రిల్ లో తెలంగాణ సర్కార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. తాజాగా రెండవ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీగా ఉన్నాం. కరీంనగర్ లేదా వరంగల్‌లో ఈ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చే అవకాశం ఉంది. ఈ నూతన ప్లాంట్ ఇన్వెస్ట్‌మెంట్‌తో కలుపుకుని తెలంగాణలో కోకాకోల కంపెనీ దాదాపుగా రూ. 2500 కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టినట్లు అవుతుంది" అని అన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ.."తెలంగాణకు అన్ని సెక్టార్ల నుంచి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అని అనడానికి , కోకా కోల సంస్థ నిర్ణయమే సాక్ష్యంగా నిలుస్తుంది. ఐటీ , ఐటీ అనుబంధ రంగాలతో పాటు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ అనుబంధ రంగాలతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్ డిఫెన్స్ వంటి సెక్టార్లలోనూ భారీ పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించింది. లేటెస్టుగా ఇంటర్నేషనల్ కంపెనీ కోకా కోల రాష్ట్రంలో తన ఇన్వెస్ట్మెంట్స్ డబుల్ చేసేందుకు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. త్వరలోనే సంస్థ ప్రతిపాదిస్తున్న అన్ని సహకారాలు అందిస్తాం" అని అన్నారు.