Prajapalana: రేషన్ కార్డే ప్రామాణికమైతే.. మరి వారి సంగతేంటి?
X
ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కచ్చితంగా 6 గ్యారెంటీలను క్రమంగా అమలు చేస్తామని కొత్త ప్రభుత్వం చెబుతోంది. అందులో భాగంగానే మరో రెండు రోజుల్లో ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికారులు ఆయా గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా తదితర పథకాలు (ఆరు గ్యారెంటీ)ల కోసం ఉదయం 8 నుండి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుండి 6 గంటల వరకు రెండు ధపాలుగా దరఖాస్తులు స్వీకరించనున్నారు.
అయితే అన్ని పథకాలకు రేషన్‌కార్డే ప్రామాణికమని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ‘రేషన్‌కార్డు లేనివారి సంగతి ఎలా?’ అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పదేళ్ల గత ప్రభుత్వ పాలనలో కొత్త రేషన్ కార్డుల ఊసు లేదు. ఉన్నవాటిని కూడా క్రమబద్దీకరించలేదు. పాత వివరాలతోనే ప్రజల వద్ద రేషన్ కార్డులుండగా... ఆ తర్వాత ఏర్పడ్డ కొత్త కుటుంబాల పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు, వారికి పెళ్లిళ్లు, వారి పిల్లలు.. ఇలా ప్రత్యేక కుటుంబాలుగా ఏర్పడిన కూడా ఆయా కార్డుల్లో వాళ్ల భార్యా పిల్లల పేర్లు కూడా ఎక్కని పరిస్థితి. వాస్తవానికి వారు ప్రత్యేకంగా కుటుంబంగా ఏర్పడ్డారు కాబట్టి.. ప్రభుత్వం అందించే అన్ని రకాల సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకొనేందుకు వారు అర్హులు. కానీ రేషన్‌కార్డు లేకపోవడం వల్ల వారు కొత్తగా దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని కోల్పోనున్నారు.
మరోవైపు రాష్ట్రంలో సుమారు 10 లక్షల రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇంకా దరఖాస్తు చేయనివారు 2 లక్షల మందిగా అంచనా వేసుకొంటే.. సుమారు 12 లక్షల కుటుంబాలు ఉంటాయి. వీరంతా ఇప్పుడు ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకోవచ్చా? లేదా? అనేది ఇప్పటివరకు అటు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు అధికారులనుంచి గానీ స్పష్టత రావడంలేదు. ఒకవేళ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకొంటే వాటిని పరిగణనలోకి తీసుకొంటారా? లేదా? అనే విషయంలోనూ గందరగోళం నెలకొన్నది.