కాంగ్రెస్లో మళ్లీ మొదలైన వార్.. భట్టితో బీసీ నేతల సమావేశం..
X
కాంగ్రెస్లో ఇంటర్నల్ వార్ మళ్లీ మొదలైనట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో పార్టీ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేస్తారనుకుంటున్న సమయంలో రెడ్డి వర్సెస్ బీసీ గొడవ మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు సమావేశం అయ్యారు. సోమవారం ఉదయం మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కి గౌడ్, మహేశ్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్‌లు భట్టి నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. నేతలు టికెట్ల కేటాయింపుపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలకు రెండు సీట్లు ఇచ్చేలా చూడాలని భట్టి విక్రమార్కకు వారు వినతిపత్రం అందజేశారు.
ఇదిలా ఉంటే ఫస్ట్ లిస్ట్ ప్రకటించే ముందు కాంగ్రెస్‌లో రెడ్డి వర్సెస్ బీసీ పంచాయితీ మొదలైంది. అంతర్గతంగా లీకైన ఫస్ట్ లిస్టులో బీజీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతల పేర్లు లేవని సమాచారం. ప్రభాకర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ మాజీ ఎంపీ పొన్నం, మధుయాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్లకు తొలి జాబితాలో చోటు దక్కలేదన్న చర్చ మొదలైంది. ఫస్ట్ లిస్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల పేర్లు ఉంటాయని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు బీసీ వర్గానికి కీలక నేతల పేర్లు లేకపోవడం వారిలో ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడుతున్న తమపై వివక్ష చూపడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నట్లు సమాచారం.
సర్వేలు పూర్తికాలేదన్న కారణంతో బీసీ నేతల పేర్లు లిస్టులో చేర్చలేదని చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీసీ, రెడ్డి అభ్యర్థుల గురించి సర్వే చేయించడం వల్ల ఆర్థికంగా బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశముందని బీసీ నేతలు చెబుతున్నారు.