రైతులకు కావాల్సినవన్నీ పీఎం కిసాన్ సేవా కేంద్రాల్లోనే : కిషన్ రెడ్డి
X
వ్యవసాయ రంగానికి మోడీ సర్కార్ పెద్దపీట వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రైతుల కోసం ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రారంభించిన కేంద్రం.. మరో కొత్త స్కీంకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రైతులకు కావాల్సిన అన్ని సేవలను ఒకే చోట కల్పించేందుకు ఎరువుల రిటైల్ షాపులను పీఎం కిసాన్ సేవా కేంద్రాలుగా మారుస్తున్నామని చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతర సేవలు పీఎం కిసాన్ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. మొదటి దశలో లక్షా 25 వేల షాపులను గురువారం రాజస్థాన్లో ప్రధాని మోడీ ప్రారంభిస్తారని వివరించారు.
భారత్ బ్రాండ్ పేరుతో రేపటి నుంచి ఈ ఎరువుల అమ్మకాలు జరుగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. అక్కడ నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు నిర్దేశిత ధరలతో అందుబాటులో ఉంటాయని చెప్పారు. 14వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను 8.5కోట్ల మంది రైతుల ఖాతాల్లో రేపు ప్రధాని జమ చేస్తారన్నారు. తెలంగాణలోని 39లక్షల మంది రైతుల ఖాతాలో కిసాన్ సమ్మాన్ నిధులు జమ అవుతాయని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడా ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ - బీఆర్ఎస్ ఒక్కటే..
లోక్సభలో విపక్షాల అవిశ్వాస తీర్మానంతో ఒరిగేది ఏంలేదని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు. కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్, ఎంఐఎంకు వేసినట్లేనని అన్నారు. ఈ మూడు పార్టీలు కుటుంబ, అవినీతి పార్టీలన్న ఆయన.. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం దగ్గర ఉందన్న ఆయన.. తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీనే సాధ్యమని చెప్పారు.