CONGRESS Candidates First List: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ.. పొత్తులపై ఇవాళ కీలక నిర్ణయం..
X
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కారును ఢీకొట్టేందుకు సరికొత్త వ్యూహాలను అమలుచేస్తోంది. కాంగ్రెస్ ఈ సారి సరికొత్త పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక చేపడుతోంది.
ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన హస్తం పార్టీ.. ఫస్ట్ లిస్ట్ ప్రకటించేందుకు సిద్ధమైంది. సుమారు 70 స్థానాల్లో అభ్యర్థుల విషయంలో స్క్రీనింగ్ కమిటీ ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. 70కి పైగా స్థానాల్లో సింగిల్ పేరును, మరో 30 స్థానాల్లో రెండేసి పేర్లను సీఈసీకి పంపినట్లు సమాచారం.
ఇవాళ మరోసాకి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. నిన్న జరిగిన భేటీలో 70స్థానాల్లో అభ్యర్థులను కన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ్టి భేటీలో పొత్తులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఈసీ భేటీ కంటే ముందు సీపీఐ, సీపీఎంలతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత జరిగే సీఈసీ భేటీ పొత్తుల అంశంపై ఓ స్పష్టత రానుంది. అయితే టీ కాంగ్రెస్ నేతలు పొత్తులు వద్దని అధిష్టానానికి చెప్తుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమకు బెర్తులు దక్కుతాయో లేదో అని ఆశవాహులు వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక ఆలస్యం కావడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తే ప్రచారానికి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. అయితే దరఖాస్తులు పెద్దఎత్తున రావడం, వలస నేతలకు టికెట్లు, బీసీ టికెట్ల అంశం వంటివి అభ్యర్థుల ప్రకటనను ఆలస్యం చేస్తున్నాయని అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉండడంతో ఎవరికి చేయి, ఎవరికి మొండిచెయి అన్నది చూడాలి.