Home > తెలంగాణ > టీ కాంగ్రెస్‌కు కరెంట్ షాక్.. రేవంత్‌పై గుస్సా.. నష్టనివారణ ఎలా?

టీ కాంగ్రెస్‌కు కరెంట్ షాక్.. రేవంత్‌పై గుస్సా.. నష్టనివారణ ఎలా?

టీ కాంగ్రెస్‌కు కరెంట్ షాక్.. రేవంత్‌పై గుస్సా.. నష్టనివారణ ఎలా?
X

తెలంగాణలో నెమ్మదిగా రాజుకుంటున్న అసెంబ్లీ ఎన్నికల వేడిలో రేవంత్ రెడ్డి ఆటం బాంబు వేశారు. రైతులకు 24 గంటల విద్యుత్ అక్కర్లేదని, 8 గంటలు ఇస్తే సరిపోతుందని ఒక్కసారిగా హీట్ పెంచారు. కాంగ్రెస్ రైతువ్యతిరేక ప్రభుత్వమని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముందని బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. మరోపక్క సొంత పార్టీ నేతలు కూడా ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘తానా’ సభలకని అమెరికా వెళ్లిన రేవంత్‌కు ఎవరిని సంపద్రించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటే తామెందుక పార్టీలో ఉండాలని ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తూ, ప్రభుత్వ అవినీతిపై మాట్లాడడం లేదని అంటున్నారు. ఏదేమైనా రేవంత్ అత్యుత్సాహంతో ఎన్నికల ముందు చేయకూడదని ప్రకటన చేసి చిక్కుల్లో పడ్డారన్నది వాస్తవం. ఇప్పుడు నష్టఃనివారణ ఎలా అని హస్తం పార్టీ బుర్ర చించుకుంటోంది.

తొలి నుంచీ అంతే..

టీడీపీని వదిలి వచ్చిన రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడం కాంగ్రెస్ నేతలకు సుతరామూ ఇష్టం లేదు. ఫైర్ బ్రాండ్ కావడం ఆయనకు ప్లస్ పాయింటే కావొచ్చుగాని దశాబ్దాలపాటు పార్టీని నమ్ముకున్నవారికి అన్యాయం చేశారని సీనియర్లకు కోపం. దీనికి తోడు రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్ ఇంట్లో చిచ్చురేపుతూ ఉంటుంది. కరెంటు గొడవకు ముందు, తాము అధికారంలోకి వస్తే అసరమైతే ములుగు ఎమ్మెల్యే సీతక్కను సీఎంను చేస్తామని రేవంత్ చెప్పారు. ఇది కూడా సీనియర్లకు మింగుడు పడలేదు. కలసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని, కానీ రేవంత్ అంతా తనేన్నట్లు హామీలు ఇవ్వడం సరికాదని భావిస్తున్నారు. ధరణి పోర్టల్ రద్దు, మ‌హిళ‌ల‌కు రూ. 500లకే సిలిండ‌ర్ వంటి హామీలను కూడా రేవంత్ ఎవరితోనూ సంప్రదించకుండా ఇచ్చిపడేశారు.

ఆయనదంతా వ్యక్తిగతం

అధిష్టానం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టే ఆయన ఇష్టారీతిలో ప్రకటను జారీచేస్తున్నట్లు కనిపిస్తోంది. సీనియర్లు ఆయన దూకుడు గురించి హైకమాండ్‌కు చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం గమనార్హం. పీసీపీ అధ్యక్షుడిగా తనకున్న స్వేచ్ఛకు, అధికారానికి మించి రేవంత్ దూకుడు పెంచారు. అయితే కొన్ని సందర్భాల్లో కరెంటు విషయంలోలా ఆయన నిర్ణయాలు ఆయనకే బూమరాంగ్ అయ్యాయి. ‘‘రేవంత్ పీసీసీ హోదాలో కాకుండా వ్యక్తిగత హోదాలో కరెంటు గురించి మాట్లాడారు. కాంగ్రెస్ అంటే ఆయనొక్కరే కాదు. లక్షల మంది కార్యకర్తలం ఉన్నాం. అన్నీ నిర్ణయించేది అధిష్టానమే’’ అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎన్నికల వేళ పార్టీని ఐక్యంగా ఉంచాల్సిన పీసీసీ చీఫ్ అనవసరంగా ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సీనియర్లు హితబోధ చేస్తున్నారు. లేకపోతే, బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య లోపాయికారీ ఒప్పందముందన్న బీజేపీ ఆరోపణలను నిజమని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని హెచ్చరిస్తున్నారు.

Updated : 11 July 2023 1:51 PM GMT
Tags:    
Next Story
Share it
Top