కాంగ్రెస్ విజయంలో బ్యాక్ ఎండ్.. ఆకునూరి మురళికి కీలక పదవి
X
టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్ధన్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీపై సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించి.. రెండు రోజుల్లో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామంటూ ఆదేశించారు. ఈ లోపే జనార్ధన్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. 2021 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా జనార్ధన్ రెడ్డిని నియమించింది. అయితే గతేడాది గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీక్ కావడం.. మళ్లీ ఆ పరీక్షను నిర్వహించగా అవకతవకలు జరిగాయంటూ హైకోర్టు పరీక్షను రద్దు చేసింది. ఈ రెండు సందర్భాలలో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల నిర్వహణలో కూడా కూడా అనిశ్చితి నెలకొంది. దీంతో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ప్రక్షాళనకు ఆదేశించింది. ఇందులో భాగంగా కొత్త కమిషన్ ఏర్పాటునకు గైడ్ లైన్స్ రూపొందించాలని రేవంత్ సూచించారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఆకునూరి మురళి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తించి పేదలు, ఆదివాసీల మన్ననలు పొందారు. గత కొంత కాలంగా ఆయన రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలపై అధ్యయనం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అణిచి వేతలకు గురైన ఆయన.. స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో మురళి ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. విద్య, మౌలిక సదుపాయాల కల్పన సలహాదారుగా నియమించింది. ఏపీలో దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన ఆయన.. మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించి గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ సమయంలోనూ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటుచేసిన ఆయన.. రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జాగో తెలంగాణ బస్సు యాత్రలు నిర్వహించి ప్రజా వేదికలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో బ్యాక్ ఎండాగా పనిచేసిన మురళికి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సముచిత స్థానం కల్పించే అవకాశం ఉంది. అందులో భాగంగానే అపారమైన అనుభవం, విద్యా రంగం పట్ల మక్కువ, నిరుద్యోగుల పట్ల కన్సర్న్ ఉన్న మురళికిటీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించే అవకాశముందని తెలుస్తుంది.