నా వాళ్ల జోలికొస్తే క్రేన్కు వేలాడదీస్తా : కొండా మురళీ
X
వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు నడుస్తోంది. గత కొన్ని రోజులుగా వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కొండా సురేఖ దంపతుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. బుధవారం కార్యకర్తల సమావేశంలో ఇరువర్గాల నేతలు కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన వాళ్ల జోలికొస్తే క్రేన్కు వేలాడదీస్తానని అన్నారు. కార్యకర్తలపై దాడులు చేసినవారిపై తొలుత పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారు చర్యలు తీసుకోకపోతే మాత్రం.. తనలోని పాత కొండా మురళీ బయటకు వస్తాడని హెచ్చరించారు.
కొత్తగా వచ్చే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు మురళీ సూచించారు. ఎంత మంది వచ్చినా.. వరంగల్ తూర్పు టికెట్ కొండా సురేఖదే అని చెప్పారు. ఆ టికెట్ సురేఖదే అని రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. పోటీలో ఎంతమంది ఉన్నా గెలిచిది మాత్రం సురేఖనే అని స్పష్టం చేశారు. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోనని హెచ్చరించారు. కాగా వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ పోటీ చేయాలనుకుంటున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి పాదయాత్రలోనే ఆ అంశంపై ఆమె స్పష్టత తీసుకున్నారు. ఇంతలో అనూహ్యంగా ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ తూర్పులో యాక్టివ్ అయ్యారు. ఆమెను జిల్లా అధ్యక్షురాలిగా కూడా నియమించడంతో ఇరువర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది
ఇక బుధవారం జరిగిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయిసమావేశంలో గందరగోళం ఏర్పడింది. సమావేశం మధ్యలోనే ఎర్రబెల్లి , కొండా అనుచరులు రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. చెప్పులు, పిడుగుద్దులతో కొట్టుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి కొండా మురళీ దంపతులు హాజరుకాలేదు. అయితే ఈ సమావేశానికి తమకు ఆహ్వానం అందలేదని కొండా దంపతులు చెప్పగా.. తాను ఫోన్ చేసిచెప్పినట్లు ఎర్రబెల్లి స్వర్ణ అంటున్నారు.