ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ను బలోపేతం చేసిందే నేను : తుమ్మల
X
ఖమ్మం జిల్లాలో డిపాజిట్లు రాని బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసింది తాను కాదా అని కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క సీటు మాత్రమే గెలిచిందని.. దీంతో పార్టీ బలోపేతం కోసం తనను బతిమాలి పార్టీలో చేర్చుకొలేదా అని కేసీఆర్ను నిలదీశారు. పాలేరు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీర్ మాట్లాడిన మాటలన్నీ అబద్దలేనని చెప్పారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు.
పాలేరులో నా ఓటమికి కేటీఆరే కారణమని అందరికీ తెలుసని తుమ్మల ఆరోపించారు. పువ్వాడ అజయ్ కుమార్‌కు ప్రభుత్వ భూములు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డికు కాంట్రాక్ట్‌లు ఇచ్చి.. తనపై అనవసర విమర్శలు చేయడం సరికాదని తుమ్మల అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజల కోసం ఎన్ని విమర్శలనైనా భరిస్తానని స్పష్టం చేశారు.తన చేరిక వేళ తుమ్మల వెంట ఆయన అనుచరులు ప్రభంజనంలా బీఆర్ఎస్లో చేరారని.. కేటీఆర్ అన్నమాటలు మర్చిపోయారా అని నిలదీశారు.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా తెలిసి కూడా కేవలం తన స్వార్థం కోసమే కేసీఆర్ అలా మాట్లాడారని తుమ్మల మండిపడ్డారు. పదవుల కోసం కాదు సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టుల కోసమే తాను పార్టీలో చేరుతున్నట్లు ఆ రోజే చెప్పానన్నారు. భక్త రామదాసు ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో తనను అపర భగీరథుడని పొగిడిన పొగడ్తలు అంతా చూశారని అన్నారు. తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని సోనియా గాంధీకి ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పారని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ ప్రతి గెలుపులో తన పాత్ర ఎంతో ఉందని చెప్పారు.