Election Commission: కేటీఆర్కు షాక్.. మంత్రిపై ఈసీకి కాంగ్రెస్ నేత ఫిర్యాదు
X
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల స్వామి షాకిచ్చారు. మంత్రిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. మంత్రి కేటీఆర్ కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి డబ్బు తీసుకోవాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నారని అందులో ఆరోపించారు. ఎలక్షన్ కోడ్ కు విరుద్ధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నందున చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరారు.
ఇటీవల ఓ బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలు అలా వచ్చిన డబ్బుతో ఓట్లు కొనాలనుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు డబ్బులిస్తే తీసుకోవాలని ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని ఓటర్లకు సూచించారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తెచ్చిన వేణు గోపాల్.. చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ 3రోజుల్లో చర్యలు తీసుకోకపోతే కోర్టులో రిట్ పిటిషన్ వేస్తానని స్పష్టం చేశారు.