నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు.. రాహుల్
X
తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు భారీ స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ‘‘ నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు. నా తెలంగాణ సోదర సోదరీమణులారా! రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండి! కాంగ్రెస్‌ను గెలిపించండి!’’ అని ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో తను పాల్గొన్న ర్యాలీ వీడియోను కూడా జతచేశారు.
రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ కూడా తెలంగాణ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ‘‘నా తెలంగాణ సోదర సోదరీమణులారా.. మా తల్లులారా..పిల్లలారా మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు వేయడం మీ హక్కు, అది మీ అతిపెద్ద బాధ్యత. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండి. అభినందనలు జై తెలంగాణ జై హింద్’’ అని ట్వీట్ చేశారు.
‘ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించడానికి అందరూ ఓటేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. ‘‘నవ, సౌభాగ్య తెలలంగాణ నిర్మాణానికి ప్రతి ఓటూ కీలకం. ఓటర్లందరూ, ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు పొందిన యువతీయువకులందరూ భారీ స్థాయిలో ఓటు వేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఓటేసేలా చూడండి’’ అని కోరారు.