Home > తెలంగాణ > అల్లు అర్జున్ మామకు మల్కాజ్గిరి టికెట్..!

అల్లు అర్జున్ మామకు మల్కాజ్గిరి టికెట్..!

అల్లు అర్జున్ మామకు మల్కాజ్గిరి టికెట్..!
X

అల్లు అర్జున్‌కు పిల్లనిచ్చిన మామ సుడి తిరిగింది. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఖాయమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఎంపీ టికెట్ హామీతోనే కంచర్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లు సమాచారం. మొన్నటి వరకు కంచర్ల బీఆర్ఎస్‌ పార్టీలో ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు.

గతంలో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరి ఎంపీ సీటు కోసం కాంగ్రెస్‌లో గట్టి పోటీనే నెలకొంది. రేవంత్ సీఎం కావడంతో మల్కాజ్‌గిరిలో ఏదో మహిమ ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడానికి పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. డబ్బు, పలుకుబడి, ఇమేజ్ ఉన్నోళ్లకే ప్రాధాన్యమిస్తోంది.

మల్కాజ్గిరి కాంగ్రెస్ టికెట్ కోసం కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు చాలా మంది రేసులో ఉన్నారు. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, సర్వే సత్యనారాయణ, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లికి, అతని కొడుక్కు ఛాన్స్ ఇవ్వడంతో ఎంపీ టికెట్ ఇవ్వడానికి పార్టీ సుముఖంగా లేదని సమాచారం. రేవంత్ బ్రదర్ కొండల్ రెడ్డికి టికెట్ ఇస్తే కుటుంబపాలన ముద్ర పడుతుందన్న భయంతో పార్టీ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాలకు కొత్త కాదు. రాష్ట్రం అవతరించాక 2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విజయం సాధించగా కంచర్ల ఫోర్త్ ప్లేస్తో సరిపెట్టుకున్నాడు. కంచర్ల స్వస్థలం నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని భట్టుగూడెం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాగర్ టికెట్‌ను తనకే ఇస్తుందని కంచర్ల ఆశించాడు. ఆ ఆశతోనే భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. తనకే టికెట్ ఖాయమని బహిరంగంగా చెప్పుకున్నాడు. అయితే కేసీఆర్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్‌కే మళ్లీ అవకాశమిచ్చాడు. దీంతో కంచర్ల పార్టీ ఫిరాయించాడు.

కంచర్ల బడా పారిశ్రామికవేత్త. నల్గొండ కాంగ్రెస్ నేతల్లో చాలామంది ఆయనకు మద్దతిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే కంచర్లకు టికెటిస్తే కాంగ్రెస్‌ నేతల్లో కొందరు తిరగబడే అవకాశముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ముందుగానే గ్రహించిన కంచర్ల తాను కాంగ్రెస్ లో కొత్త కాదని ప్రచారం చేసుకుంటున్నాడు. 2014లో బీఆర్ఎస్‌లో చేరకముందు తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, కాలేజీ రోజుల్లో యూత్ కాంగ్రెస్‌లో పనిచేశానని చెబుతున్నాడు. రేవంత్ అండ, పలుకుబడికి తోడు బన్నీ మామ అనే ఇమేజ్ తనకు కలిసొస్తుందని కంచర్ల ఆశ. ఇదిలా ఉంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ 10 సీట్లను కైవసం చేసుకోవడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. అందులో మల్కాజ్‌గిరి కూడా ఉందని తేలడంతో పోటీ తీవ్రంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే ఛాన్సిచ్చిన రేవంత్ అన్ని సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని కంచర్ల వైపు మొగ్గు చూపుతన్నారని సమాచారం.

Updated : 19 Feb 2024 12:03 PM GMT
Tags:    
Next Story
Share it
Top