mla jaggareddy : బీఆర్ఎస్లో చేరడంపై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్
X
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ నెల 23న మెదక్లో జరిగే కేసీఆర్ సభలో ఆయన గులాబీ కండువా కప్పుకుంటారని వార్తలొచ్చాయి. ఈ ప్రచారంపై జగ్గారెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. కొంతకాలంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. తనపై తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమస్యలపై మాట్లాడేందుకు మంత్రులను, సీఎంను కలవడం తప్పేలా అవుతుందని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్‌లో నేను ఉండకూడదని కొందరు భావిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎన్నికలు రాగానే మళ్లీ నేను పార్టీ మారుతున్నట్లు పోస్టులు పెడుతున్నారన్నారు. తాను కాంగ్రెస్‌లో ఉండకూడదన్నది ఎవరి వ్యూహమని ప్రశ్నించారు. ఏడాదిన్నరగా తనపై పార్టీలో దుష్ప్రచారం జరుగుతోందన్నారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగిన పది రోజులకే తనపై పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత శాడిజం ఏమిటో తనకు అర్థం కావడం లేదని వాపోయారు.
తన రాజకీయ ప్రయాణం రాహుల్ గాంధీతోనే అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ‘‘నా రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీతోనే. నాకేమైనా బాధ్యత ఇస్తే కచ్చితంగా చేస్తాను. నేను రాహుల్ గాంధీని మొదటిసారి కలిసిన విషయం అందరికీ తెలుసు. నేను రెండవరోజు కూడా ఒంటరిగా రాహుల్‌ను కలిశాను. నేను చెప్పేది రాహుల్ విన్నారు. ఆయన ఏం సమాధానం చెప్పలేదు. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. నాది శాసించే వయస్సు.. నన్ను ఎవరో బుజ్జగిస్తే వింటానా?. నేను కారెక్కే ప్రస్తక్తే లేదు. కాంగ్రెస్‌లోనే ఉంటా ’’ అని చెప్పారు.